భారత రాజ్యంగం..ప్రియాంబుల్ లో ఏముంది

updated: March 11, 2018 22:38 IST

భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను నిర్దేశిస్తూ భారత  రాజ్యాంగం తయారైంది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా రాజ్యాంగం నిర్దేశిస్తోంది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.   

అలాగే రాజ్యాంగ ప్రవేశికను ‘పీఠిక, అవతారిక, ముందుమాట, ఉపోద్ఘాతం’ లాంటి పర్యాయ పదాలతో పిలుస్తూంటారు. ఆంగ్లంలో  దీన్ని ’ప్రియాంబుల్' అంటారు.  భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్య్రాన్ని, అంతస్థుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949, నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్‌లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాం అని ఉంటుంది.

 

ప్రవేశికను రాజ్యాంగానికి ఆత్మ, హృదయంగా వర్ణిస్తారు. ప్రపంచంలో ప్రవేశికతో కూడిన  లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న మొదటి దేశం అమెరికా. భారత రాజ్యాంగ ప్రవేశికకు కూడా ఇదే ఆధారమైనప్పటికీ, ఇందులోని లక్ష్యాలు, ఆదర్శాలకు ప్రధాన ప్రాతిపదిక మాత్రం ‘ఆశయాల తీర్మానం’ . వీటిని  జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో 1946 డిసెంబరు 13న ప్రతిపాదించారు. ఫ్రాన్స్ రాజ్యాంగంలోని ‘స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం’ అనే పదాలు, ఐక్యరాజ్య సమితి  చార్టర్‌లోని ప్రకటన కూడా మన రాజ్యాంగ ప్రవేశికకు ఆధారాలుగా చెప్పవచ్చు.రాజ్యాంగం రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు.

భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది

comments